తేవార పారాయణం
కాంచీపురంలోని పిళ్లైయార్ పాళ్యంలోని తిరుమెట్రలై వీధిలో నివసించే శ్రీ కె. నటరాజ ఓదువర్ గారికి ఇప్పుడు(2003) డెబ్బైఎనిమిది సంవత్సరాలు. పరమాచార్య స్వామివారిపై అపారమైన భక్తి. వారు చెప్పిన విషయం:
పరమాచార్య స్వామివారు పల్లకీలో వెళ్తున్నప్పుడు, నేను ఎన్నోమార్లు తేవారం పత్తికాలు పాడేవాడిని. ఒకసారి స్వామివారు తిరుజ్ఞానసంబంధర్ కచ్చి మెట్రళై, పిళ్లైయార్ పాళ్యంలో సంపూర్ణ అనుగ్రహాన్ని ఇచ్చారు. నేను ‘తిరుమెట్రళై తేవారం’ పాడాను. వెంటనే స్వామివారు, “నువ్వు తిరుముదుకుండ్రప్ పత్తికం పాడు” అని ఆదేశించారు. ‘దేవా, సిరియోమ్ పిళైప్ పొరుప్పే, పెరియోణే’ (దేవా, నా తప్పులను సహించు, నేను చిన్నవాణ్ని) అన్న మాటలతో మొదలయ్యే జ్ఞాసంబంధర్ తేవారం పాడాను. ‘తిరుఏకాంబమ్ పత్తికం’ పాడమని స్వామివారి తరువాతి ఆజ్ఞ. ‘పణ్డు సెయ్ ద పళవినయిన్ పయన్’ (గత కాలంలో చేసిన కర్మ ఫలం) అని మొదలయ్యే అప్పర్ తేవారం పాడడం మొదలుపెట్టాను. మహాస్వామి వారు ఎంతో సంతోషించి నన్ను ఆశీర్వదించారు.
మహాస్వామి వారు సతారాలో మకాం చేస్తున్నప్పుడు, మేము మువ్వూరు ఒదువర్లమూ తీర్థయాత్రలో భాగంగా అక్కడికి వెళ్లాము. మమ్మల్ని చూడగానే స్వామివారు చాలా ఆనందపడ్డారు. మమ్మల్ని రెండు రోజులపాటు అక్కడే ఉండి, రోజూ పూజలో తేవారం పాడమని ఆదేశించారు. స్వామివారి ఆదేశానుసారం మేము మువ్వురమూ శ్రీమఠంలోనే ఉండి తేవారం పాడేవారం. స్వామివారి నుండి సెలవు తీసుకునేటప్పుడు మమ్మల్ని అనుగ్రహించి మాకు ధోవతులను బహూకరించారు. రైల్వేస్టేషనుకు వ్యాను కూడా ఏర్పాటు చెయ్యడం స్వామివారి అవ్యాజ కరుణకు పరాకాష్ట. అది మమ్మల్ని కదిలించివేసింది.
కాంచీపురం బంగారు తోటలో ఉన్న పెరియవా మఠంలో ప్రతి నెలా జరిగే అనుషం విశేష పూజలో ఉదయం పది గంటలప్పుడు నేను తేవారం పారాయణం చేస్తున్నా, రాత్రివేళల్లో పుష్పాపల్లకిలో స్వామివారి చిత్రపటం ఊరెరిగింపుగా జరుగుతున్నప్పుడు కూడా తేవార పారాయణం చేస్తున్నానంటే దానికి కారణం పరమాచార్య స్వామివారి అనంతమైన కరుణ మాత్రమే.
--- కె. నటరాజ ఓదువర్. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం