శ్రీవారి అతీంద్రియ శక్తి :
ఒకసారి స్వామివారిని హైదరాబాదులో దర్శనం చేసాను. మా నాన్నగారు రామాయణంలో విశ్వామిత్రుడు రామునితో అన్న "రామ! జగన్మోహనా!" అనే పద్యం స్నానం చేసేటప్పుడు, ఖాళీ సమయాల్లో కుర్చున్నపుడు ఎల్లప్పుడూ ఎంతో ఆర్తితో చదువుకొంటూ ఉండేవారు. శ్రీవారు ఆ పద్యాన్ని అదే స్వరంతో అంతే ఆర్తితో చదివి "మీ నాన్నగారెప్పుడూ ఈ పద్యాన్ని చదువుతూ ఉండేవారు కదా?" అని ప్రశ్నించారు. నేను నివ్వెర పడినాను. మా నాన్నగారిని వారెరుగరు. వారుగతించి చాలాకాలమయింది. మరి ఆ పద్యాన్ని ఎల్లప్పుడూ అంత ఆర్తితో చదువుతూ వుండే వారన్న విషయం వీరికేలా తెలిసింది. దాంతో నా వొళ్ళు గగుర్పొడిచింది. ఆరోజు తెనుగు చదవడం తెలుసునా అని పృచ్చించిన నా అజ్ఞానత్వానికి సూటి సమాధానం ఇది.
ఈ కాలంలో కొద్దో గొప్పో శక్తి సంపాదించిన వారంతా దుకాణాలు పెట్టుకుంటున్నారు. ఆశ్రామలు, హాస్పటల్స్ అంటూ పెంచుకు పోతున్నారు. మహా శక్తీ సంపన్నులయిన స్వామివారు మాత్రం ఏమి తెలియని వారివలె వున్నారు. ఆయన లక్షణంగా సకల భోగభాగ్యాలు అనుభవిస్తూ కాలుమీదకాలేసి కూర్చుని మహారాజులా అనుభవించవచ్చు. వీరు "ఊ" అంటే ధనరాసుల్ని పోగులుగా కుమ్మరించే వారు అనేకులు వున్నారు. అయినా ఆయన ఈ సుఖాలన్నీ కాలదన్నుకొని రోజూ పది క్రోసులో, ఇరవై క్రోసులో ఈ లేవలేని రోజుల్లో ముసలితనంలో నడుస్తూనే వున్నారు.
అది యోగమో, సౌఖ్యమో, ధ్యానమో, మరి ఏ ఇతరమో తెలియదు కానీ ఒక అపూర్వమయిన శక్తి వారివద్దనున్నదని చెప్పుకోవాలి. ఆ శక్తి ఎటువంటిది, ఎక్కడిది అంటే మనమేమి చెప్పగలం? అయితే శక్తికి, శక్తిమంతులకు అభేదం కనుక ఎల్లప్పుడూ నమస్కరించుకొంటూ, ఆ భగవంతుని నారాయణ స్మరణ ఫలం ఈ లోకానికెల్లా మేలు చేయగలదని ప్రార్థిస్తున్నాను.
:- 22/05/1981, గురజాడలో స్వామివారి జయంతి సభలో కీ శే తాడేపల్లి రాఘవానారాయణ శాస్త్రులవారు పలికిన మాటలు.
#KanchiParamacharyaVaibhavam #Paramacharya