బ్రాహ్మణ హత్య - గోగ్రాసం
ఒక ధనిక భక్తుడు ఒకసారి తన మిత్రుడు పొరుగూరికి వెళ్ళాలంటే తన కారును ఇచ్చాడు. దురదృష్టవశాత్తు ఆ వాహనానికి ప్రమాదం జరిగి అందులో ప్రయాణిస్తున్న అతని మిత్రుడు సంఘటనా స్థలంలోనే చనిపోయాడు.
ఈ విషయం ఆ భక్తునికి చాలా బాధను కలుగచేసింది. తన ఆవేదన అంతా, తన వల్ల ఒక కుటుంబం యజమానిని కోల్పోయిందన్న బాధ. ఆ కుటుంబానికి తను ఎంతగానో ఆర్థిక సహాయం చేశాడు, కానీ ఎంత డబ్బు ఇస్తే మాత్రం పోయిన ప్రాణం తిరిగివస్తుంది అని చాలా బాధపడేవాడు.
ఆ భక్తునికి ఒక అనుమానం కూడా ఉండేది. తన వల్ల చనిపోయాడు కాబట్టి ఒక బ్రాహ్మణున్ని చంపిన బ్రహ్మహత్యా దోషం తనకు తగులుతుంది అని. కానీ తన మానసిక వ్యథను చెప్పుకోవడానికి తనకు ఎవరూ దొరకలేదు. శాస్త్ర ప్రమాణం, పరిహారం తెలిపే వారు కూడా ఎవరూ లేరు. అందుకోసమే శాస్త్రం పై మహోన్నతాధికారం కలిగిన మహాస్వామి వారి వద్దకు వచ్చాడు.
మహాస్వామి వారు ఆ భక్తుడు చెప్పినదంతా సాంతంగా విన్నారు. అతనితో ఇలా అన్నారు ”ఆ ప్రమాదం దైవాధీనం. నీ సంకల్పములో గాని నీ చేష్టితములో గాని ఏమి దోషము లేదు. కానీ ఏలనో నీకు పాపభీతి కలిగినది. అంతే కాకుండా లోకోపవాదం కూడా వచ్చింది.
కనుక మొదట ఒక పని చెయ్యి. రామేశ్వరం వెళ్ళి సేతుస్నానము ఆచరించు. సూర్యోదయాత్పూర్వమే నిద్రలేచి వీధిలో వెళ్ళే ఒక గోవుకి తినడానికి గ్రాసం అందించు. రోజు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి, ఈశ్వరుని దర్శించు. రోజుకు ఒక్క పూట మాత్రమే భుజించు. ఇవన్నీ నీవు చేసినట్లైతే నీకు కలిగిన దోషము, అపవాదు తొలగిపోగలదు”
భక్తుడు సంతోషించి, ప్రసాదం స్వీకరించి కొద్దిగా సంకోచిస్తూ అక్కడే నిలబడ్డాడు.
మహాస్వామి వారు చూసి, “ఏమిటి నీ సందేహము?” అని అడిగారు. ”అన్ని విషయములు పాటించగలను. కానీ గోవుకు గ్రాసం అందివ్వడం సాధ్యపడదు. ఎందుకంటే నేను నివసించే పట్టణములో ఎక్కడా వీధులలో ఆవులు కనపడవు” అని అన్నాడు.
మహాస్వామి వారు ఠక్కున జవాబిచ్చారు. “ఐతే ఏంటి? మీ ఊరిలో ఎక్కడో ఒక చోట గోశాల ఉంటుంది కదా! నీ దగ్గర కారు కూడా ఉంది కదా! ఉదయం ఐదు గంటలకు లేచి నీ కారులో వెళ్ళి అక్కడ ఉన్న అన్ని గోవులకు గ్రాసం తినిపించి రా”
ఆ భక్తుడు చాలా సంతోషించి మహాస్వామి వారికి సాష్టాంగం చేసి వెళ్ళిపోయాడు.
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం