కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి): post #5366 — TG.ME

ఆ జాతకం ఇలా ఇవ్వు

ఆత్తూర్ గ్రామంలో ముకుందరాజ్ పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. పదోన్నతితో అక్కడి నుండి చెన్నైకి మకాం మార్చాడు. అతనికి యమ్.టెక్ చెదివిన ఒక కుమారుడు ఉన్నాడు. ఉన్నత చదువులు చదివి ఉండడం వల్ల కుమారునికి యు.యస్. లో ఉద్యోగం లభించాలని ఆశించేవాడు. కనుక ఉద్యోగ ప్రయత్నాలకు ముందు అబ్బాయి జాతకం ఒకసారి చూపించాలని అనుకున్నాడు. అప్పట్లో బేతనాయకన్ పాళ్యంలో ఉంటున్న ఆంధ్రదేశానికి చెందిన రాంబట్ల శాస్త్రిగారు ప్రముఖ జ్యోతిష్యులు. వారితో మంచి పరిచయం ఉన్న శ్రీనివాసన్ అనే సహాయకునికి అబ్బాయి జాతకం ఇచ్చాడు.

ఆయన జాతకాన్ని పరిశీలించి యు.యస్ లో ఉద్యోగం లభిస్తుందని, తెలిసిన బంధువుల పిల్లతో వివాహం నిశ్చయమవుతుందని చెప్పారు. నాలుగు నెలలోనే ఇవన్నీ జరుగుతాయని కూడా చెప్పారు. దీన్నంతా కాగితంపై వ్రాసి శ్రీనివాసన్ కు ఇచ్చారు.

ముకుందరాజ్ ఊర్లో లేకపోవడం చేత, తను వచ్చిన తరువాత ఈ విషయాలు చెబుదామని జాతకాన్ని శ్రీనివాసన్ తన బ్యాగులో ఉంచుకున్నాడు. ప్రతినెలా పరమాచార్య స్వామివారిని దర్శించడం శ్రీనివాసన్ కు ఆనవాయితీ. కొన్నిరోజుల తరువాత మహాస్వామి వారి దర్శనానికి వెళ్ళాడు. ఆరోజు దర్శనానికి చాలామంది భక్తులు వచ్చారు. వారి కష్టాలను చెప్పుకొని స్వామివారి ఆశీస్సులు అందుకుంటున్నారు.

అలా వరుసలో ఉన్న ఒకామె వంతు రాగానే తన కుమారునికి యు.యస్ ఉద్యోగం లభిస్తుందా? త్వరగా పెళ్ళి కుదురుతుందా? అని స్వామివారిని అడిగింది. కాని ఆమె తమ పోస్ట్ మాష్టర్ ముకుందరాజ్ భార్య అని శ్రీనివాసన్ కి తెలియదు.

స్వామివారు నవ్వుతూ శ్రీనివాసన్ వైపు చూసి, “నీ బ్యాగులో ఉన్న ఆ జాతకం ఇలా ఇవ్వు” అని అడిగారు. శ్రీనివాసన్ జాతకంతో పాటు ఆ జ్యోతిష్కుడు వ్రాసిచ్చిన కాగితాన్ని కూడా బయటకు తీసాడు. దాన్ని ఆమెకు ఇవ్వమని స్వామివారు ఆదేశించారు. ఏంజరుగుతోందో అప్పుడు అర్థమైంది ఇద్దరికి.

బ్యాగులో జాతకం ఉందన్న విషయం స్వామివారికి ఎలా తెలుసు? మనుషుల మనస్సులను తెలుసుకునే మహాస్వామివారికి బ్యాగులో ఏముందో తెలుసుకోవడం పెద్ద కష్టమా?

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం