కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి): post #5368 — TG.ME

నేలపై పడ్డ ప్రసాదం

రామస్వామి అయ్యర్ సేలంలో ప్రముఖ న్యాయవాది. ఆ వృత్తిలో ఆయన బాగా రాణిస్తున్నారు. పరమాచార్య స్వామివారి అశేషకోటి భక్తులలో ఆయన కూడా ఒకరు. వారు ఒకసారి మహాస్వామివారి దర్శనానికి వెళ్ళారు. ఆయన వరుసలో నిలబడి స్వామిని దర్శించుకొని విభూతిని ప్రసాదంగా తీసుకున్నారు.

స్వామివారు ఇచ్చేటప్పుడే పొరపాటున చెయ్యి జారిందో లేక తీసుకునే మునుపే ఈయన చెయ్యి వెనక్కు తీసుకున్నారో మొత్తానికి విభూతి ప్రసాదం నేలపై పడింది. నేలపై పడ్డ విభూతిని తీసుకోవడం ఏమిటని రామస్వామి అయ్యర్ ప్రసాదం కోసం మరలా చెయ్యి చాచారు.

అప్పుడు స్వామివారు “నేలపై పడ్డ ఆ ప్రసాదం తీసుకో ఆన్నారు”. మన్నుతో కలిసిన ఆ ప్రసాదాన్నే రామస్వామి అయ్యర్ స్వీకరించాడు. ఎందుకు నేలపై పడ్డ ప్రసాదాన్ని తీసుకొమ్మని స్వామివారు ఆదేశించారు అని పరిపరి విధాల ఆలోచించారు. ఇంటికి చేరుకునే దాకా ఆ అసంతృప్తి వదల్లేదు.

ఎన్నో ఏళ్లుగా న్యాయస్థానంలో కొనసాగుతున్న తంజావూరులో ఉన్న రామస్వామికి చెందిన భూముల వ్యవహారం కొన్ని రోజుల తరువాత ఆయన పరం అయ్యాయి. ఆ న్యాయవాది ఆనందం అనిర్వచనీయం. అసలు దక్కదు అనుకున్న స్థిరచారాస్తులు దక్కితే ఆ ఆనందం వేరు కదా.

ఈ విషయాన్ని మహాస్వామివారికి చెప్పడానికి వెంటనే స్వామీ వద్దకు బయలుదేరారు. రామస్వామి అయ్యర్ ను చూడగానే స్వామివారు ఏమన్నారో తెలుసా?

“ఆరోజు నేలపై పడ్డ ప్రసాదాన్ని తీసుకోవడానికి నువ్వు చాలా ఆలోచించావు. చూశావా ఈరోజు నీకు అంత భూమి లభించింది” అని అన్నారు.

అసలు వచ్చిన విషయం చెప్పడానికి రామస్వామి ఇంకా నోరు కూడా తెరవలేదు. ఆ వచ్చిన విషయమూ, ఆ విషయానికి సంబంధించిన విషయము కూడా స్వామివారే చెప్పేశారు. ఇదే సామాన్యులు అర్థం చేసుకోలేని పరమాచార్య స్వామివారి దివ్య కరుణ.

--- శ్రీ ఆర్. వెంకటస్వామి, “కంచి మహానిన్ కరుణై నిళగల్” నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం