పట్టమ్మాళ్ పరమాచార్య జ్ఞాపకాలు ప్రముఖ గాయనీమణి, కర్ణాటక సంగీత త్రయంలో… — కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి) — TG.ME

పట్టమ్మాళ్ పరమాచార్య జ్ఞాపకాలు

ప్రముఖ గాయనీమణి, కర్ణాటక సంగీత త్రయంలో ఒకరుగా పేరుగాంచిన శ్రీమతి డి.కె పట్టమ్మాళ్ (మిగిలిన ఇరువురు శ్రీమతి యమ్.యస్. సుబ్బులక్ష్మి, శ్రీమతి యమ్.యల్. వసంతకుమారి) ఏడు సంవత్సరముల వయస్సప్పుడు కంచి పరమాచార్య స్వామివారి అనుగ్రహం పొందింది. చిన్నప్పుడు ఆమె తరుచుగా తన తండ్రితో పాటు కంచి మఠానికి వచ్చేది. తండ్రి ఆదేశం మేరకు కంచి కామాక్షి అమ్మవారి దర్శనం తరువాత మఠంలో శ్రావ్యంగా శ్లోకాలు చెప్పేది.

పట్టమ్మాళ్ లోని విద్వత్తుని గమనించిన మహాస్వామివారు ఆ పిల్లని స్వామివారు చాతుర్మాసం చేస్తున్న ఎసనూర్ కు తీసుకురావాల్సిందిగా ఆ పిల్ల తండ్రికి స్వయంగా చెప్పారు. నవరాత్రి పూజలో కృష్ణస్వామి దీక్షితర్ పాల్గొనాలని, అలాగే చిన్ని పట్టమ్మాళ్ కూడా తమ తొమ్మిది రోజుల పూజలో పాడాలని స్వామివారి కోరిక.

నవరాత్రి పూజలో పెట్టిన కలశంలోని టెంకాయను తమ తండ్రికి ఇచ్చి, దాంతో పాయసం చేసి పిల్లకు పెట్టమని చెప్పిన సంఘటనని పట్టమ్మాళ్ అమితానందంతో గుర్తుచేసుకుంటారు. తరువాతి కాలంలో ఆవిడ ఈ సంఘటనని ఆర్తితో గుర్తుచేసుకొని తన విద్వత్తు, గెలుపు అంతా స్వామివారి అరుదైన అనుగ్రహం వల్లనే కలిగింది అని చెబుతారు.

ముత్తుస్వామి దీక్షితర్ గారి ఆనందభైరవి రాగంలోని, ‘ఆనందేశ్వరేణ సంరక్షితోహం’ కీర్తన గురించిన ఒక సంఘటన ఆవిడ గుర్తుచేసుకున్నారు. ఒకసారి పట్టమ్మాళ్ కాంచీపురం వెళ్ళి, పరమాచార్య స్వామివారిని దర్శించుకొని, స్వామి ముందు ఈ కీర్తన పాడారు. స్వామివారు ఆమెని మెచ్చుకున్న తరువాత ఈ కీర్తనని ఎక్కడా కచేరీలలో పాడవద్దని సెలవిచ్చారు. మహాస్వామి వారి ప్రకారం ఆ కీర్తన సన్యాసులు యతుల సమక్షంలో, కేవలం పూజలలో, దేవాలయాలలో మాత్రమే పాడాలి.

“నా చిన్నతనంలో నేను ప్రతిరోజూ, కంచి పరమాచార్య స్వామివారి ముందు పాడేదాన్ని. నాకు మంచి వాక్శుద్ధి లభించిందని, నా ఉచ్ఛారణ చాలా స్పష్టంగా ఉన్నదని చెప్పారు స్వామివారు” అని ఆనందంతో చెబుతారు పట్టమ్మాళ్.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
August 18, 2026 2.1K 5