God's of Hindu: post #129363 — TG.ME

*గాయత్త్రీ వ్యాహృతి సంధ్యా* అని గాయత్రీ మాతను కీర్తించాడు హయగ్రీవ మహర్షి. దీనినిబట్టి మనకర్థమయ్యేదేమిటంటే - సంధ్య ఎవరో గాదు - గాయత్త్రే. ఆ గాయత్రి కూడా ఎవరో కాదు- శ్రీలలితా పరదేవతే , మహాశక్తే. ఆ శక్తి కాలస్వరూపిణి. కాలమంటే కదిలేది. అచలమైన తత్త్వం నుండి చలించి వస్తుంది ఆ శక్తి. చలించి , పరా పశ్యంతి , మధ్యమా , వైఖరీ అని నాలుగు దశలలో కిందికి చలించి దిగి వచ్చింది. వచ్చి , అదే మనకు చివరకు వైఖరీ రూపమైన ఈ ప్రపంచంగా కనిపిస్తుంది. ఈ చరాచర ప్రపంచమే - నిరంతర భ్రమణశీలమైన ఆ గాయత్రీ శక్తి.

మన *నాత్త్రాయతే ఇతి మన్త్రః* మననం చేసే కొద్దీ మనలను కాపాడేదేదో అదీ మంత్రమంటే. *మంత్రాణా మర్థస్తిరోహితో భవతి* అని పెద్దలు చెప్తారు. మంత్రం పైకి కనిపిస్తున్నా మంత్రార్థమలా కనిపించదు. అందులో రహస్యంగా ఉంటుంది. మననం వల్లనే అది ప్రకటితమవుతుంది. ఆదిభౌతికం , ఆధ్యాత్మికం , ఆది దైవికమని మూడు భూమికలలో భావన చేయాలి. ఆది దైవికమైన స్థాయి నుంచే దిగి వచ్చిందది మనదాకా. దిగి వచ్చేటప్పుడది గాయత్రి.
*గాయత్త్రీ త్రాయతే ఇతి గాయత్రి*. ఎవరా మంత్రాన్ని గానం చేస్తుంటే వారిని కాపాడుతుంది కనుక గాయత్రి అయింది.
*న గాయత్య్రాః పరం మంత్రం నమాతుః* పరదైవతమ్ గాయత్రికి మించిన మంత్రము లేదు. తల్లిని మించిన దేవత లేదని దివ్య సూక్తి. ఏ మంత్రానుష్ఠానం చేసినా , ముందు గాయత్రి మంత్రం చేస్తేనేగాని దాని ఫలితం మనకు రాదు. అదీ గాయత్రి మంత్ర జప విశిష్టత. గాయత్రీ ఛందసామహమ్ అని ఋక్కులలో గాయత్రి మంత్రమును తానేనని భగవద్గీత పదవ అధ్యాయంలో గీతాచార్యుడు నొక్కి వక్కాణించటం - గాయత్రీ మంత్ర మహోదాత్తత విశదమవుతుంది. సద్బుద్ధి ప్రదాయిని గాయత్రి. దీర్ఘాయువు , సత్సంతానం , గోవులు , కీర్తి , ద్రవ్యము, బ్రహ్మ వర్చస్సులను ప్రసాదించి , అంత్యంలో బ్రహ్మమును అనుగ్రహించు కరుణామయి *‘గాయత్రి’* అని చెపుతోంది అధర్వణ వేదం.

గాయత్రీ మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు వస్తాయి. వాటిని మూడు భాగాలుగా చేస్తే , ఒక్కొక్క భాగానికి ఎనిమిది అక్షరాలు వస్తాయి. ఈ మూడు ఖండాలు - సృష్టి స్థితి లయాలకు సూచితం. మొదటి ఖండం - ఋగ్వేదం ; రెండవది-సామవేదం ; మూడవది - యజుర్వేదం అవుతాయి. కనుక గాయత్రి వేదమాత.

గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలకు , వాల్మీకి మహర్షి ఒక్కొక్క అక్షరానికి వెయ్యి శ్లోకాలతో , వెరసి ఇరవది నాలుగు వేల శ్లోకాలతో శ్రీమద్రామాయణ మహాకావ్యాన్ని రచించారు. కనుకనే , గాయత్రీ మంత్రాక్షర ఘటితమైన శ్రీమద్రామాయణము సర్వశక్తి సమన్వితమయింది. కాలచక్రాన్ని తన సంచారంతో నడిపించేవాడు సూర్యుడు. చండ మార్తాండ మండల మధ్యలో సూర్యునికి అధిష్ఠాత్రి అయి అతనికి కూడా సత్తా స్ఫూర్తులను కలిగించే చిన్మయ చైతన్య రూపిణి గాయత్రి.

*ప్రాణశక్తి గాయత్రి*

సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి నెల రోజులు పడుతుంది. ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకతలుంటాయి. ప్రకృతిలో అనేక మార్పులొస్తాయి. అవి మానవ శరీరంపై , మనసుపై ప్రభావం చూపుతాయి. పుట్టినప్పుడు ఏ రాశిలో సూర్యుడున్నాడో అది ముఖ్యమైన ప్రాణశక్తి. ప్రాణం మన శరీరంలో నాభి దగ్గర ఉంటుంది. అందుకే సృష్టించే బ్రహ్మదేవుడు - స్థితి కారకుడైన విష్ణుమూర్తి నాభి కమలం లోంచి జన్మించాడు. గర్భస్థ శిశువు నాభి , తల్లి నాభి కలుస్తాయి. ఇదే గర్భస్థ శిశువులకు ప్రాణశక్తిని ఇచ్చేది. బయటకు వచ్చిన తర్వాత శిశువును వేరు చేస్తారు. అలా వేరవగానే సూర్యశక్తి - ప్రాణశక్తిగా పుట్టిన శిశువుకు సమకూరుతుంది. ఈ శక్తియే గాయత్రీ మాత. పిల్లలు ఎదిగినకొద్దీ వారికి ప్రాణశక్తిని ఎలా పొందాలనే విషయమై ప్రాణామాయ కుండలినీ శక్తి గురించి నేర్పాలి. రోజూ మూడుసార్లు త్రిసంధ్యలలో ప్రాణాయామం చేస్తే బుద్ధి వికసిస్తుంది , పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఆ సంధ్యా దేవతే గాయత్రీమాత.

*గాయత్రీ జప సుప్రీతాయై నమః- సూర్య సహస్ర నామావళి*

మనకి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. అందరికీ ఆరోగ్యాన్ని, జీవించటానికి ఆహారాన్ని ఇచ్చేవాడు. కనుకనే ఆదిత్యుణ్ణి - అన్నదాత , ఆరోగ్య ప్రదాత అన్నారు. తల్లి తన పిల్లలకు పాలిచ్చి పోషిస్తుంది. సూర్యభగవాడు సమస్త జీవరాశులకు , వృక్ష లతాదులకు , ప్రకృతిలోని అన్నింటికీ పోషకుడు. పంచభూతములకు (భూమి , నీరు , అగ్ని , వాయువు , ఆకాశము) సూర్యుడు స్ఫూర్తిదాయకుడు, శక్తినిచ్చేవాడు. అందుకే సూర్యుణ్ణి *‘పూషణ్’* అన్నారు.
కాలభేదములు ఏర్పడటానికి సూర్యుడే కారకుడు. ఒక్క సెకన్ కూడా తేడా లేకుండా ఆయా ప్రదేశాలలో , ఆయా ఋతువులను అనుసరించి ఆయా తేదీలలో సూర్యోదయ , సూర్యాస్తమానాలు జరుగుతాయి. ఎన్ని సంవత్సరాలకైనా అదే సమయంలో జరుగుతుంది. కనుక కాల నియమం , సమయ పాలన , కాలప్రాముఖ్యతకు , సూర్యుడే ఆదర్శంగా నిలుస్తాడు. ఇది లేకపోతే జ్యోతిశ్శాస్తమ్రే లేదు. నిత్యానుష్ఠాన కర్మలే లేవు. సూర్యుడు రాకపోతే రోజు గడవదు. అతడు త్యాగమూర్తి , నిత్య కర్తవ్య పరిపాలకుడు. అందుకే మహర్షులు *‘‘మీరు కూడా సూర్యుని వలె ఉండండని , ఆత్మ తేజస్సుని వికసింపచేసుకోండి’’* అని చెప్పారు.
August 28, 2026 57